పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
AP Women Commission notice to Pawan Kalyan.పవన్ కళ్యాణ్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా
By తోట వంశీ కుమార్ Published on 22 Oct 2022 1:31 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. శనివారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఈ మేరకు పవన్‌కు నోటీసులు పంపారు.
పవన్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలు సమాజంలో కలకలం రేపాయని, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశం ఇస్తూ పవన్ మాట్లాడిన మాటలతో మహిళాలోకం షాక్ కు గురైందన్నారు. దీనిపై వెంటనే సంజాయిషీ ఇస్తారని మహిళా కమిషన్ ఎదురుచూసినట్లు తెలిపారు. అయినా పశ్చాత్తాపం కానీ, క్షమాపణలు కానీ లేవన్నారు.
"ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లి చేసుకోవాల్సి వస్తే అది కచ్చితంగా వ్యతిరేక అంశమే. 'కోట్ల రూపాయలు భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. చేతనైతే మీరు చేసుకోండి.' అని మీరు అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారు..? కోట్లు, లక్షలు, వేలు ఇలా ఎవరికి చేతనైతంతగా వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే.. ఏ మహిళ జీవితానికి భద్రత ఉంటుంది..? ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పెళ్లిళ్లపై మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా..? మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని తలకెత్తుకోరా..??
మీ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి 'స్టెప్నీ' అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపణీయం. మహిళల్ని భోగవస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఈ పదం వాడతారు. మీ వ్యాఖ్యలపై ఇప్పటికే చాలా మంది ఫిర్యాదులు చేశారని, ఈ మాటలు అవమానకరంగా, మహిళల భద్రతకు ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మహిళలను కించపరిచే మాటలు మీరు మాట్లాడడం, చేతనైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపు ఇవ్వడంపై తక్షణమే మీరు మహిళలకు క్షమాపణ చెప్పాలని, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మహిళా కమిషన్ ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు.
మూడు రాజధానుల వ్యవహారం నేపథ్యంలో వైసీపీ నేతలు తనను మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ టార్గెట్ చేయడంపై స్పందిస్తూ.. ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాను విడాకులు ఇచ్చి, భరణం ఇచ్చాకే మరో పెళ్లి చేసుకున్నారన్నారు. చేతనైతే మీరు కూడా భరణమిచ్చి మరో పెళ్లి చేసుకోండని చెప్పారు. ఒక్క పెళ్లి చేసుకుని ముప్పై మంది స్టెఫ్నీలతో తిరుగుతారని వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా మహిళా కమిషన్ పవన్‌కు నోటీసులు జారీ చేసింది.