ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్..3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం!
రాష్ట్రంలో మరో రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By - Knakam Karthik |
ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్..3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం!
అమరావతి: రాష్ట్రంలో మరో రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు.
వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
మంగళవారం (07-04-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి(జి) లక్ష్మీపురంలో 57.5మిమీ, శ్రీకాకుళం (జి) ఎచ్చెర్లలో 52.5మిమీ, డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ (జి) రామచంద్రాపురంలో 52.5మిమీ, ఏలూరు(జి) తదువై లో 47.5మిమీ, తూర్పుగోదావరి (జి) నిడదవోలు 40.5మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.
అలాగే రేపు నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గుడూరు మండలాలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు మండలాల్లో(08) వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు. సోమవారం అనంతపురం(జి) తెరన్నపల్లిలో 42°C, కడప (జి) రాజుపాలెంలో 41.9°C, మార్కాపురం(జి) నందన మారెళ్లలో 40.7°C, నంద్యాల(జి) పేరుసోమలలో 40.6°C, నెల్లూరు (జి) వరికుంటపాడులో 40.3°C, అన్నమయ్య(జి) గోపిదిన్నెలో 40.1°C, కర్నూలు(జి) తోవిలో 40°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.