రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం

మిచౌంగ్‌ తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందవద్దని సీఎం జగన్‌ కోరారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు.

By అంజి  Published on  13 Dec 2023 6:18 AM IST
APnews, discoloured paddy, cyclone, farmers, CM Jagan

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం

మిచౌంగ్‌ తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందవద్దని సీఎం జగన్‌ కోరారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని రైతులకు తెలియజేసి.. వారిలో ధైర్య నింపాలని, సంక్రాంతి లోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల తుపాను కారణంగా నష్టపోయిన రైతుల నుంచి తడి, రంగు మారిన వరి ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. తుపాను బాధిత రైతులకు వారి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత పంటలు, వరి ధాన్యం కొనుగోళ్లపై క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు రైతుల్లో విశ్వాసం నింపాలని అధికారులు, ఎమ్మెల్యేలకు సూచించారు.

రైతులకు అందుతున్న ఆదరణను పరిశీలించి, తడిసిన, రంగు మారిన వరి ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేస్తుందని, అదే సందేశాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. అవసరమైతే అధికారులు నిబంధనలను సడలించి రైతులకు న్యాయం చేయాలని, ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేయాలని, పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించాలన్నారు.

ఇప్పటికే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, తుపానులో పంట నష్టపోయిన రైతులకు ఉచిత ఫసల్ బీమా యోజన కింద బీమా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్యుమరేషన్ పనులు ప్రారంభమయ్యాయని, డిసెంబర్ 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్‌బీకేలలో జాబితాలను ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు. డిసెంబరు 23 నుంచి 25 వరకు పరిశీలన తర్వాత ఫిర్యాదులను స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్లు తుది పరిహారం జాబితాలను ప్రభుత్వానికి పంపుతారని వారు తెలిపారు. సంక్రాంతికి ముందే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.

Next Story