టీడీపీకీ ఎస్ఈసీ నిమ్మగడ్డ నోటీసులు..
AP Sec Nimmagadda notice to TDP.నిమ్మగడ్డ టీడీపీ పార్టీకి నోటీసులు జారీ చేయడం పెద్ద చర్చగా మారింది.
By తోట వంశీ కుమార్ Published on 31 Jan 2021 5:21 AM GMTఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీనే ఎస్ఈసీ నిమ్మగడ్డ టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నిమ్మగడ్డ పనిచేస్తున్నారని పలువురు వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఇప్పడు నిమ్మగడ్డ టీడీపీ పార్టీకి నోటీసులు జారీ చేయడం పెద్ద చర్చగా మారింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరిట ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మేనిఫెస్టో ఎన్నికల నియమావళికి విరుద్ధమని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ రహితంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. పార్టీ గుర్తులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని చట్టం స్పష్టం చేస్తోందని కమిషన్ దృష్టికి వైసీపీ నేతలు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టో విడుదలపై ఆపార్టీ వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఎస్ఈసీ టీడీపీకి నోటీసులు జారీ చేసింది.
ఫిబ్రవరి 2లోపు వివరణ ఇవ్వాలన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక ఎన్నికల్లో మేనిఫెస్టో సరైనది కాదని ఆ లేఖలో పేర్కొన్నారు. వివరణ ఇవ్వని పక్షంలో తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.