అమరావతి: ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్టు టీడీపీ ప్రకటించింది. వరుసగా రెండు నెలలు ఫించన్ తీసుకోకపోయినా మూడో నెల ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చని తెలిపింది. వైఎస్ జగన్ హయాంలో రద్దు చేసిన ఈ వెసులుబాటును తిరిగి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు వితంతు పింఛనుపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పింఛనుదారు మరణిస్తే అతని భార్యకు మరుసటి నెల నుంచే పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని టీడీపీ పేర్కొంది. భర్త ఒకటో తేదీ నుంచి 15వ తేదీలోపు మరణిస్తే వెంటనే పింఛన్ ఇవ్వాలని, 15 నుంచి 30వ తేదీలోపు మరణిస్తే వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకూడదని, ఆసరగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.