ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బు పట్టుబడుతుంది. హైదరాబాదు నుండి బయలుదేరిన ఓ వ్యాన్ వెళ్తుండగా వెనుక నుండి ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో కెమికల్ పౌడర్ తీసుకువెళుతున్న వ్యాన్ బోల్తా పడింది. ఆ దెబ్బకు అందులో ఉన్న బస్తాలన్నీ బయటపడ్డాయి. పోలీసులు ఆ బస్తాలను చెక్ చేయగా.. కోట్ల కొలది నగదు బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని అనంతపల్లి ఎర్ర కాలువ వద్ద ఐఛర్ లారీ మితిమీరిన వేగంతో వెళ్లి ముందు వెళ్తున్న వ్యాన్ ను వెనుక నుండి ఢీకొట్టడంతో బోల్తా పడింది. హైదరాబాదు నుండి మండపేటకు కెమికల్ పౌడర్ బస్తాలను తీసుకువెళ్తున్న ఆ వ్యాన్ ఒక్క సారిగా బోల్తాపడడంతో అందులో ఉన్న బస్తాలన్నీ కింద పడిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్తాల్లో ఏడు అట్టపెట్టలు లభ్యం కావడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని టోల్ ప్లాజా అడ్మిని స్ట్రేటివ్ భవనం వద్దకు తరలించారు. అనంతరం పోలీసులు అధికారుల సమక్షంలో పెట్టలను తెరిచి చూడగా అందులో సుమారు రూ.7 కోట్లు బయటపడింది. పోలీసులకు ఏమాత్రం అనుమానం కలగకుండా కెమికల్ పౌడర్ బస్తాలలో డబ్బులతో కూడిన అట్టపెట్టలు పెట్టి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. కానీ రోడ్డు ప్రమాదం జరగడంతో కోట్ల రూపాయల వ్యవహారం కాస్త బట్టబయలైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.