అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం.. రాజమండ్రి మహిళ మృతి

AP Piligrim lost her life in amarnath tour. అమర్‌నాథ్‌యాత్రలో గల్లంతైన ఏపీకి చెందిన మహిళ మృతి చెందింది. ఏపీ నుంచి యాత్రకు వెళ్లిన వారిలో ఐదుగురు భక్తుల

By అంజి  Published on  11 July 2022 7:51 AM GMT
అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం.. రాజమండ్రి మహిళ మృతి

అమర్‌నాథ్‌యాత్రలో గల్లంతైన ఏపీకి చెందిన మహిళ మృతి చెందింది. ఏపీ నుంచి యాత్రకు వెళ్లిన వారిలో ఐదుగురు భక్తుల ఆచూకీ తెలియడం లేదని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు నిన్న తెలిపారు. గల్లంతైన వారిలో ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మ పేటకు చెందిన మునిశెట్టి సుధ, కొత్త పార్వతి ఆచూకీ తెలియాల్సి ఉండగా.. ఇవాళ సుధ మృతదేహాన్ని ఆమె భర్త విజయ్ కిరణ్ గుర్తించారు. సుధ మృతి చెందినట్లు స్పష్టత రావడంతో పార్వతి జాడ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

మంచు లింగాన్ని దర్శించుకోవడానికి నెల్లూరు, ఏలూరు, తణుకు, రాజమహేంద్రవరానికి చెందిన సుమారు 34 మంది అమర్‌నాథ్‌కు వెళ్లారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కలిసి వీరు నివసించే సమీపంలో ఆకస్మికంగా వరద రావడంతో వరదలో చిక్కుకుని కొందరు చనిపోగా మరికొందరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టగా లభిస్తున్న మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరికొందరి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ వస్తున్నాయని వారి ఆచూకీ దొరకడం లేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమర్‌నాథ్‌కు వెళ్లిన వారి క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రలో గల్లంతైన మహిళ గాయపడి ఎక్కడైనా చికిత్స పొందుతూ ఉండొచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొండ చరియల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీ యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీభవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్‌ హిమాన్షు కౌషిక్‌ శ్రీనగర్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అమర్‌నాథ్‌ యాత్ర పునర్ ప్రారంభం

భారీ వరదల నుంచి కోలుకున్న తర్వాత అమర్‌నాథ్ యాత్ర సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ సమీపంలో వరదలు సంభవించిన మూడు రోజుల తర్వాత యాత్ర ఆరంభమైంది. తాము భోలే బాబా దర్శనం కోసం ఎదురు చూస్తున్నామని. యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు సంతోషంగా ఉందని అమరనాథ్ యాత్రికులు చెప్పారు.

Next Story