ఏపీ సర్కార్ తీపికబురు..ఆ జీవిత ఖైదీలకు త్వరలోనే విముక్తి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జైళ్లలో వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తోన్న ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది

By Knakam Karthik
Published on : 18 April 2025 12:07 PM IST

Andrapradesh, AP Government, Release Of Life Convicts

ఏపీ సర్కార్ తీపికబురు..ఆ జీవిత ఖైదీలకు త్వరలోనే విముక్తి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జైళ్లలో వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తోన్న ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జైళ్లలో మంచి ప్రవర్తనతో ఉండే ఖైదీలను పరిశీలించి త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు శిక్ష నుంచి మినహాయింపు ఇస్తూ గురువారం రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల వివరాలతో జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని జైళ్ళ శాఖ డీజీ ని ఆదేశించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, న్యాయశాఖ కార్యదర్శి, సీఐడీ డీజీ, ప్రధాన న్యాయ సలహాదారు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, జైళ్ల శాఖ డీజీ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ జాబితాను సమీక్షించి, ఖరారు చేస్తుందని పేర్కొంది.

ఇవే ఖైదీల మార్గదర్శకాలు..

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం వివిధ కేసులలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారికి శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చి ముందస్తుగా విడుదల చేయడానికి మార్గదర్శకాలను ఖరారు చేసింది. ప్రతి ఖైదీకి సంబంధించిన కేసులు, శిక్ష, ఇతరత్రా నిబంధనలకు అనుగుణంగా కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఏటా మూడు విడతల్లో.. ఫిబ్రవరి, జూన్‌, అక్టోబరులో ఖైదీలను విడుదల చేసేలా కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. అర్హులైన ఖైదీలు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి. శిక్షాకాలం పూర్తయ్యే వరకూ స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్‌ అధికారి వద్ద ప్రతి 3నెలలకు ఒకసారి హాజరవ్వాలి. విడుదల తర్వాత ఏదైనా నేరానికి పాల్పడితే క్షమాబిక్ష రద్దవుతుందని కుమార్‌ విశ్వజీత్‌ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Next Story