దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన
అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.
By - Knakam Karthik |
దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన
అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి సంస్థ(APEDB)ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. దక్షిణ కొరియా లో సహజ సిద్ధమైన,సాంస్కృతిక,సాంప్రదాయక పర్యాటక ప్రదేశం గా ఉన్న నామీ ఐలాండ్ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. సియోల్ లో ఉన్న అతి పెద్ద పర్యాటక ప్రాంతం ఇదే కావడం విశేషం. ఇక్కడ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లతో ఏడాది పొడవునా సంగీత ఉత్సవాలు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్ధికంగానూ అభివృద్ధి సాధిస్తుంది. నామీ ద్వీపం అభివృద్ధి, పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై సీఈవోతో మంత్రి నారాయణ చర్చించారు. 4,60,000 చ.మీ.విస్తీర్ణంలో అందమైన చెట్లు, పూల మొక్కలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న నామీ ద్వీపంలో అనుసరిస్తున్న విధానాల ను అమరావతిని బ్లూ - గ్రీన్ సిటీగా రూపుదిద్దడంలో పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ నిర్ణయించారు.
సియోల్‌లోని చియాంగ్‌గేచెఒన్ వాగును మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు.30 ఏళ్ల క్రితం పూర్తిగా మురుగునీటితో తీవ్ర కాలుష్యకారకంగా ఉండి ఆ తర్వాత అత్యంత పరిశుభ్రంగా మారిన చియాంగ్‌గేచెఒన్ వాగును పరిశీలించారు. 2003–2005 మధ్యకాలంలో సీయోల్ నగరంలో మెరుగైన వాతావరణం కల్పించడం కోసం "చియాంగ్‌గేచెఒన్" పునరుద్ధరణ ప్రాజెక్టును స్థానిక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీయోల్ నగర వాతావరణాన్ని మెరుగుపరచడం కోసం చేసిన ప్రయత్నం ఫలించి నేడు అత్యంత ఆహ్లాదకరంగా చియాంగ్‌గేచెఒన్ వాగు పరిసర ప్రాంతాలు మారాయి.
ముఖ్యంగా గతంలో అత్యంత మురికిగా, కాలుష్య కారకంగా ఉండే"చియాంగ్‌గేచెఒన్" వాగులోని నీరు.. నేడు పునరుద్ధరణ తర్వాత ఎంతో స్వచ్ఛంగా మారడం, గాలి నాణ్యత పెరగడం, శబ్ద కాలుష్యం తగ్గడం.. తద్వారా జీవవైవిధ్యం మెరుగుపడటం ఈ వాగు పునరుద్ధరణలో ప్రత్యేకత.ఏపీలో కాలుష్య కారకంగా మారిన నదులు, కాలువలు, వాగులు వంటి వాటిని పునరుద్ధరించే కోణంలో ఈ వాగును మంత్రులు,ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎం.టీ.కృష్ణ బాబు, కన్నబాబు పరిశీలించారు.