అమరావతి: ఏపీ మంత్రుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఎల్జీ సంస్థ హెడ్ క్వార్టర్‌లో ఆ సంస్థ ప్రతినిధులతో ఏపీ మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఎల్జి కార్యాలయానికి విచ్చేసిన మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డిల బృందానికి ఎల్జీ సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ఎల్జి ప్రతినిధులకు మంత్రులు వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా.. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఎల్జీ సంస్థ ప్రతినిధులను మంత్రులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి తీరుతెన్నులు, పెట్టుబడిదారులకు ఉన్న అపార అవకాశాలపై మంత్రులు వివరించారు.