ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు: మంత్రి రోజా
AP Minister Roja criticized TDP chief Chandrababu Naidu. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 15 April 2023 2:42 PM ISTAP Minister Roja criticized TDP chief Chandrababu Naidu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఇంటికే ప్రభుత్వం అనేరీతిలో జగన్ పాలన కొనసాగుతుందని.. ప్రజల వద్దకే మా వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెళుతున్నారని, వారి సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. మీ మేనిఫెస్టోను తీసుకురండి, మా మేనిఫెస్టో తీసుకొస్తాం.. ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలనే అడుగుదామని రోజా అన్నారు. ఈ సవాల్ ను స్వీకరించే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. జగన్ కు దమ్ముందని, ఆయన పాలనపై నమ్మకం ఉందని చెప్పారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా అన్ని పనులను వాలంటీర్లు చేసి పెడుతున్నారని రోజా చెప్పారు. జగన్ స్టిక్కర్ల మీద కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. టీడీపీ, జనసేన వాళ్లు దొంగతనంగా వెళ్లి వైసీపీకి పోటీగా స్టిక్కర్లను అంటిస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు అని అన్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని రాష్ట్రాన్ని మోసం చేశారని విమర్శించారు.
చంద్రబాబు ముసలి నాయకుడని, మూలకు కూర్చోవాల్సిందేనని అన్నారు. జగనన్నపై ప్రజలకు నమ్మకం ఉందని.. మాకు వస్తున్న స్పందన చూస్తేనే అర్థం అవుతుందని వివరించారు. ఏడు లక్షల మంది జగన్ సైనికులు 63 లక్షల 93 వేల మంది ఇళ్లకు వెళ్లారన్నారు. జగన్ స్టిక్కర్లు చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనన్నారు. కొంతమంది ఓర్వలేక తమ నాయకుడి స్టిక్కర్లను తొలగిస్తున్నారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.