పోలవరంలో మాజీ సీఎం జగన్ చేసిన తప్పిదాలను ఏపీ సీఎం చంద్రబాబు సరిదిద్దుతున్నారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్టాంట్, జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని అన్నారు. 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని ఫేజ్-1, ఫేజ్-2 లను తీసుకొచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశాడని మంత్రి నిమ్మల ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు చరిత్రలో 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ రెండు ఫేజ్‌లను కేంద్రానికి పంపి జగన్ చేసిన పాపం నేడు రాష్ట్రానికి శాపంగా మారింది. చంద్రబాబు హయాంలో 18 నెలలు శ్రమించి పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్‌ను ధ్వంసం చేసిన జగన్.. చరిత్రహీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. రూ.990 కోట్లతో తిరిగి చంద్రబాబు డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తున్నారు. పోలవరం నిర్వాసితులకు నాడు 2017లో రూ.830 కోట్లు.. తర్వాత 2024లో రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసి సీఎం చంద్రబాబు న్యాయం చేశారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పునరావాస కాలనీలకు ఒక్క అర బస్తా సిమెంట్ పని చేయకుండా జగన్ దగా చేశాడు. గత ప్రభుత్వం విధ్వంసం నుంచి.. మళ్లీ చంద్రబాబు ఆధ్వర్యంలో పోలవరం పునర్నిర్మాణం జరిగి 2027 డిసెంబర్‌కు పూర్తవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.