పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో జగన్‌నే అడగాలి: మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు
By Knakam Karthik
పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో జగన్‌నే అడగాలి: మంత్రి నిమ్మల
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. "పోలవరం కోసం కేంద్రం రూ.17,860 కోట్లు చెల్లించింది. ప్రాజెక్టు వల్ల 96,660 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. నిర్వాసితులకు తొలి దశలో రూ.1,203 కోట్లు అందించాం. ఇంకా 18,266 కుటుంబాలకు రూ.1340 కోట్లు చెల్లించాలి. ఇప్పటివరకు 12,797 నిర్వాసితుల కుటుంబాలను తరలించాం. ఇంకా 27,263 కుటుంబాలను తరలించాలి. 75 నిర్వాసితుల కాలనీల్లో 49 నిర్మాణంలో ఉన్నాయి. ఆగస్టు లోపు భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి దశ ఆర్అండ్ఆర్‌ను 2026 జూన్ లోపు పూర్తి చేస్తాం. అని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భూములు, ఇళ్లు త్యాగం చేసిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. 2019 ఎన్నికలకు ముందు పోలవరం ఎత్తు గురించి ఎక్కడా ప్రస్తావన ఎక్కడా లేదు. జగన్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లు, 45.72 మీటర్లు గా విభజించి రెండు ఫేజులుగా చేశారు. 45.72 మీటర్లకు పోలవరం పూర్తి చేసి నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం. 2024 సెప్టెంబర్ లో పోలవరం ఎత్తును 41.15 కు ఎందుకు ఆమోదించారన్న వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబుప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. అబద్దాన్ని వంద సార్లు చెబితే నిజమవుతుందని వైసీపీ సభ్యులు భావిస్తున్నారు. 41.15 ఎత్తుతో ప్రతిపాదనలు పెట్టింది జగన్ సర్కారే.. దాని గురించి వైఎస్ జగన్ నే అడగాలి 5 ఏళ్లలో ఒక్క కాలనీలో ఇంటి పునాదికి జగన్ సర్కారు ఇటుక ముక్క వేయలేదు. ఏపీ పట్టించుకోకపోవడంతో తెలంగాణలో కలపాలని నిర్వాసిత గ్రామస్తులు ఆందోళనకు చేయాల్సిన పరిస్ధితి వచ్చింది..అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.