డయేరియాతో ఇద్ద‌రు మృతి.. మంత్రి నారాయణ అత్యవసర‌ సమీక్ష

అంజనాపురం కాలనీలో తీవ్ర వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు

By Medi Samrat
Published on : 24 Oct 2024 9:00 PM IST

డయేరియాతో ఇద్ద‌రు మృతి.. మంత్రి నారాయణ అత్యవసర‌ సమీక్ష

అంజనాపురం కాలనీలో తీవ్ర వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఈ అనారోగ్యాలకు నీటి కాలుష్యం కారణమా కాదా అని తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి తక్షణమే విచారణకు ఆదేశించాలని మంత్రి ఆదేశించారు.

స్థానిక బోరుకు సంబంధించిన నీటి నమూనాలను విజయవాడలోని పరీక్షా కేంద్రానికి పంపనున్నట్లు అధికారులు నివేదించారు. ఈలోగా ఈ ప్రాంతంలోని అన్ని బోర్లను మూసివేసి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని మంత్రి సూచించారు. సమీక్షా సమావేశంలో, డ్రైనేజీ వ్యవస్థల్లోని మురుగునీటిని వెంటనే తొలగించాలని, భద్రత కోసం అన్ని బావి, నీటి వనరుల గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేయాలనిమంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర మునిసిపాలిటీల నుండి అదనపు సిబ్బందిని తీసుకువచ్చే అవకాశాన్ని కూడా ఆలోచించాలని ఆయన ప్రస్తావించారు.

ఇక విజయనగరం జిల్లా గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించిన ఆయన మృతుల కటుంబాలను ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వానంగా మారాయన్నారు. 14 మంది డయేరియాతో చనిపోయినా ప్రభుత్వానికి పట్టింపులేదని మండిపడ్డారు. మృతుల సంఖ్యపైనా మంత్రులు, అధికారులు తలోమాట చెప్పారని వైఎస్‌ జగన్ ఆరోపించారు.

Next Story