ఏ అంశంపై పోరాడుతున్నారో వారికే స్పష్టత లేదు, వైసీపీపై మంత్రి లోకేశ్ సెటైర్

వైసీపీనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి..ఇప్పుడు వారే ధర్నాలు చేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.

By Knakam Karthik  Published on  12 March 2025 11:48 AM IST
Andrapradesh, Minister Nara Lokesh, Tdp, Ysrcp

ఏ అంశంపై పోరాడుతున్నారో వారికే స్పష్టత లేదు, వైసీపీపై మంత్రి లోకేశ్ సెటైర్

వైసీపీనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి..ఇప్పుడు వారే ధర్నాలు చేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. శాసనమండలిలో ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల అంశంపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. మండలి ఛైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. అన్ని విషయాలపై చర్చకు సిద్ధం. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వ బకాయిలపైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం..అని మంత్రి నారా లోకేశ్ సవాల్ చేశారు.

ఫీజు పోరు అని పేరు పెట్టి.. యువత పోరుగా పేరు మార్చడం వింతంగా ఉంది. బయట నవ్వుకుంటున్నారు. ఏ విషయంపై పోరాడుతున్నారో వైసీపీకి స్పష్టత లేదు. ఒక పెద్దాయన నాతో చెప్పాడు.. ఓ వ్యక్తిని హిందూపూర్ కోర్టుకు తీసుకెళ్లగా జడ్జి ముందు బోరున ఏడ్చాడు. నాకు తల్లిదండ్రులు లేరు, నాకు అన్యాయం జరుగుతోంది, నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. ఎందుకు అమాయకుడిని తీసుకువచ్చి ఇబ్బందులు పెడుతున్నారని జడ్జి పోలీసులను అడిగారు. అప్పుడు తల్లిదండ్రులను చంపింది ఇతనే అని పోలీసులు చెబుతారు. జగన్ రెడ్డి తీరు కూడా ఇదేవిధంగా ఉంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వారే పెట్టి.. వారే ధర్నాలు చేస్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.4,271 కోట్లు పెట్టి వారే ధర్నా చేస్తారు. కరెంట్ ఛార్జీలు వారే పెంచి వారే ధర్నా చేస్తారు. ఎందుకు ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.4,271 కోట్లు బకాయిలు పెట్టారో సమాధానం చెప్పాలి. దీనిపై చర్చకు సిద్ధం. స్వల్పకాలిక చర్చ కూడా ఉంది. అన్ని అంశాలు చర్చిద్దాం. వైసీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు పోయాయో చర్చిద్దాం..అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

Next Story