విద్యాశాఖపై చర్చ పెడితే ఎందుకు పారిపోయారు.. మంత్రి లోకేశ్ వార్నింగ్
విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు పారిపోయారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
By Knakam Karthik Published on 19 March 2025 12:45 PM IST
విద్యాశాఖపై చర్చ పెడితే ఎందుకు పారిపోయారు..వైసీపీకి మంత్రి లోకేశ్ వార్నింగ్
వైసీపీ హయాంలో ఎంతమంది విద్యార్థులు ఏ స్కూల్ లో చదువుతున్నారో డేటా లేదని, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స.. డేటా ఎందుకు లేదో సమాధానం చెప్పాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే అంశంపై మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు పారిపోయారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. హౌస్ అజెండా బీఏసీ నిర్ణయిస్తుంది. విద్యలో సంస్కరణలపై చర్చ జరగాలని వైసీపీనే కోరింది. మేం సన్నద్ధమై సభకు వచ్చాం. హౌస్ ఛైర్మన్ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీ చెప్పినట్లు నడవదు. తమకు కావాల్సినప్పుడు చర్చ పెట్టాలని, ఈ రోజు మూడ్ బాగాలేదు, మేం బయటకు వెళ్లాలని, వేరే పనులు ఉన్నాయని, పార్టీ మీటింగ్ లు ఉన్నాయని వాయిదా వేయాలనుకుంటే అందుకు ప్రభుత్వం, ఛైర్మన్ సిద్ధంగా లేరని మండిపడ్డారు. బొత్స సీనియర్ నాయకులని, మంత్రిగా పనిచేశారని, ఆలోచించి మాట్లాడాలని అన్నారు. విద్యారంగంపై సభలో విపులంగా చర్చించడం జరిగింది. నోట్ కూడా ఇచ్చాం. అది చదవాలని వైసీపీ సభ్యులకు మంత్రి నారా లోకేశ్ సూచించారు.
12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరం కావడంపై చర్చకు సిద్ధం..
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ విద్యలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు పాఠశాల విద్యలో ఎంతమంది విద్యార్థులు చదివారో లెక్కలు చెప్పాలని సవాల్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధం. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్లారు, ఏ ప్రైవేటు పాఠశాలలో సంఖ్య పెరిగిందో మేం చెబుతాం. వైసీపీ హయాంలో డ్రాప్ బాక్స్ విధానం తీసుకువచ్చారు. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచేందుకు విద్యార్థులను డ్రాప్ బాక్స్ లో పెట్టారు. 17 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న విద్యార్థులు లక్ష మంది పాఠశాల విద్యలో ఉన్నారు. ఆ వివరాలన్నీ ఇవ్వగలం. టోఫెల్ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ అచీవ్ మెంట్ సర్వే చూస్తే.. 2017లో ఇంగ్లీష్ లో భారతదేశంలో నాలుగో స్థానంలో ఉన్నాం. వైసీపీ హయాంలో 14 స్థానానికి ఎందుకు పడిపోయామో సమాధానం చెప్పాలి. పదో తరగతి సోషల్ సైన్స్ లో 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎలా పడిపోయామో చెప్పాలి. సైన్స్ విషయానికి వస్తే మొదటిస్థానం నుంచి 15వ స్థానానికి పడిపోయాం. గణితంలో మొదటిస్థానం నుంచి 12వ స్థానానికి ఎలా పడిపోయామో చెప్పాలి.
ఏ స్కూల్ లో చదువుతున్నారో డేటా లేదు..
కనీసం ఎంతమంది పిల్లలు, ఏ స్కూల్ లో చదువుతున్నారో డేటా లేకుండా వైసీపీ చేసింది. రెండేళ్లు మంత్రిగా పనిచేసిన బొత్స.. డేటా ఎందుకు లేదో సమాధానం చెప్పాలి. ఏ టీచర్ ఏ స్కూల్ లో పాఠాలు చెబుతున్నారో డేటా లేదు. సమాధానం చెప్పాలి. ఏ డేటా లేక బేసిక్ డ్యాష్ బోర్డ్ తయారు చేయలేకపోతున్నాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిప్పుడు 6నెలల్లో డ్యాష్ బోర్డు రూపొందించాం. గ్రిప్ వచ్చింది. విద్యారంగంలో ఇప్పుడిప్పుడే డ్యాష్ బోర్డ్ తయారవుతోంది..అని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
చదువులోకి మతం తీసుకురావద్దు. కులం, మతం, ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నాం.కరిక్యులంలో రాజకీయాలు తీసుకురావద్దని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరిస్తున్నా. #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/PXQV7keCpO
— Telugu Desam Party (@JaiTDP) March 19, 2025