2019లో ఓ రాక్షసుడు మద్య నిషేధం చేస్తానని మహిళల తాళిబొట్లు తెంచాడు: లోకేశ్
స్త్రీ శక్తి పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు
By Knakam Karthik
2019లో ఓ రాక్షసుడు మద్య నిషేధం చేస్తానని మహిళల తాళిబొట్లు తెంచాడు: లోకేశ్
విజయవాడ: మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టారు. ఈ పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... స్త్రీశక్తి పథకం వల్ల విద్యార్థినులు, ఉద్యోగాలు చేసుకునే మహిళల పై భారం తగ్గుతుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకు రూ.1500 భారం తగ్గుతుంది. 2019లో అధికారంలోకి వచ్చిన ఒక రాక్షసుడు మద్యనిషేధం చేస్తానని చెప్పి, విషం కంటే ప్రమాదకర మద్యం అమ్మి మహిళల తాళిబొట్లు తెంచాడు. యువగళం పాదయాత్రలో మీ కష్టాలు చూశాకే సూపర్ -6 పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరాను...అని లోకేశ్ పేర్కొన్నారు.
గతంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని స్కూల్ కి పంపి, ఇంకొకరిని పనికి పంపాలి అనేది గత ప్రభుత్వం విధానం. ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇచ్చారు. 67 లక్షల 27 వేల మందికి 10 వేల కోట్లు ఇచ్చారు. దీపం పథకం ద్వారా 2 కోట్ల సిలెండర్లు ఉచితంగా ఇచ్చారు. సొంత చెల్లెలు రాఖీ కట్టని అన్నలు మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు. సొంత తల్లి, చెల్లి నమ్మని వారు మాపై విమర్శలు చేస్తారు. వారికి నా సమాధానం ఒక్కటే, ముందు ఇంట్లో ఉన్న మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. ప్రభుత్వం మారడం వలన 19 నుండి 24 వరకూ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరు చూసారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రం లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనన్న నాయకత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు పడింది. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలి అంటే ప్రభుత్వ కొనసాగింపు ముఖ్యం...అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.