అమరావతి: మొంథా తుపాన్ కారణంగా ఏ ఒక్కరికీ ప్రాణనష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేసింది..అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. విపత్తు పరిశీలన అంటే రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన జగన్ కు తుఫాన్లు గురించి మాట్లాడే అర్హత లేదు. తుఫాను వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాదేమో. మోoథా తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా సీఎం సూచనల మేరకు విద్యుత్ శాఖ 2రోజులు ముందే అప్రమత్తమై సిబ్బందిని మోహరించింది. ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసింది. దాదాపు 1500మంది సిబ్బందిని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాలకు మోహరించాం. నష్టం జరిగిన 24గంటల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాం..అని గొట్టిపాటి పేర్కొన్నారు.   
దాదాపు 13వేల విద్యుత్ స్తంభాలు, 3 వేల కిలోమీటర్లు మేర కండక్టర్, 3 వేల ట్రాన్స్‌ఫార్మార్స్  వరకూ దెబ్బతిన్నాయి. వ్యవసాయ, ఆక్వాకు సంబంధించి వాలిపోయిన విద్యుత్ స్తంభాలు వంటివి మరో 48గంటల్లో పునరుద్దరిస్తారు. కొన్ని చోట్ల గాలుల వేగం ఎక్కువగా ఉన్నందునే పవర్ షట్ డౌన్ చేశాం. విద్యుత్ సిబ్బంది కూడా ప్రాణాలు ఫణంగా పెట్టి నిర్విరామంగా పని చేశారు. ప్రతీ ఒక్క విద్యుత్ సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలువుతున్నా..అని మంత్రి గొట్టిపాటి తెలిపారు.