విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోదని గొట్టిపాటి తెలిపారు. వైసీపీ సభ్యులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది వైసీపీనే అని అన్నారు. రైతులకు పగటిపూట విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.