మంత్రి ఇంట తీవ్ర‌ విషాదం.. విచారం వ్యక్తం చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

By Knakam Karthik
Published on : 21 March 2025 3:08 PM IST

Andrapradesh, Minister Farooq Wife Passed, Cm Chandrababu, Condolences

ఏపీ మైనారిటీ సంక్షేమ మంత్రి ఇంట్లో విషాదం..విచారం వ్యక్తం చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి షహనాజ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షహనాజ్ ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నట్టుగా పేర్కొన్నారు. పలువురు మంత్రులు, టీడీపీ ముఖ్య నాయకులు కూడా షహనాజ్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఫరూక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ అర్ధాంగి షహనాజ్ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని సీఎం చంద్రబాబు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని, ఈ కష్ట సమయంలో గుండె నిబ్బరంతో ఉండాలని మంత్రి ఫరూఖ్ ను కోరుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ అర్ధాంగి షహనాజ్ కన్నుమూశారని తెలిసి చింతించానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జీవిత భాగస్వామి దూరమైన బాధను తట్టుకునే మనోధైర్యాన్ని ఫరూఖ్ గారికి ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఏపీ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ ప‌విత్ర రంజాన్ మాసంలో ఇంతిఖాల్ అయ్యారు. ఆమెకు జ‌న్న‌త్‌లో ఉన్న‌త‌మైన స్థానం ప్రసాదించాల‌ని, ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని అల్లాని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను’’ అని మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Next Story