పంచాయతీ ఎన్నికల రీ షెడ్యూల్ ఇదే..!
AP Local Body Election ReSchedule. పంచాయతీ ఎన్నికల వాయిదాకు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. ఏపీలో పంచాయతీ ఎన్నికల రీ షెడ్యూల్.
By Medi Samrat Published on 25 Jan 2021 10:48 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాయిదా కోరుతూ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం కొట్టివేసింది. ఉద్యోగ సంఘం తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులు పనిచేయకుండా, పిటిషన్ వేయడం ప్రమాదకరమైన ధోరణి అని.. ఉద్యోగుల ప్రవర్తన పూర్తి అసంతృప్తికరంగా ఉందని, ఎన్జీవోలు చట్టానికి వ్యతిరేకమన్న భావన కనిపిస్తోందని అభిప్రాయపడింది.
ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని.. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు ప్రతీసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్ కౌల్ చెప్పారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నాలుగు దశల్లో ఎన్నికలు ఉంటాయని.. అయితే రీషెడ్యూల్ చేసిన మేరకు రెండో దశ ఎన్నికలను మొదటి దశగా మార్చారు. మూడో దశ ఎన్నికలను రెండో దశగా మార్చారు. నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుదో దశగా మార్చారు. మొదటి దశకు ఈ నెల 29 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చిన షెడ్యూల్ కొత్త పోలింగ్ తేదీలను కూడా ప్రకటించారు. ఇంతకుముందు... 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పగా.. తాజాగా 9, 13, 17,21 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో ఎన్నికలకు సిద్ధం కానందున రీషెడ్యూల్ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఈసీ చెబుతోంది. ఎన్నికల అంశంపై చర్చించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ ఉన్నతాధికారులు గైర్హాజరు అయ్యారు.