అమరావతి: ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం విజయవాడలోని సిట్ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి ఆయన వచ్చారు. అనంతరం అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో వేల కోట్ల విలువైన లిక్కర్ స్కామ్‌లో భారీగా లబ్ధి పొందిన కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనక రాజ్ కసిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారని వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి నిన్న బయటపెట్టారు.
విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ మేరకు మిథున్ రెడ్డి అధికారులు ప్రశ్నించనున్నారు. లిక్కర్ కేసులో విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. సిట్ అధికారుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు.