సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదు : జీవో నెం.1పై ఏడీజీపీ వివరణ

AP Law and Order DG's explanation on GO No.1. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నెం.1పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

By M.S.R  Published on  10 Jan 2023 1:34 PM GMT
సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదు : జీవో నెం.1పై ఏడీజీపీ వివరణ

ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నెం.1పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జీవో నెం.1పై ఏడీజీపీ రవిశంకర్ వివరణ ఇచ్చారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని.. అయితే నియమనిబంధనలు మాత్రం ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజల భద్రత చాలా ముఖ్యమైన అంశమని అన్నారు. ఇటీవల జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఈ జీవో తీసుకువచ్చినట్టు డీజీ వెల్లడించారు. 1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చారని.. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ జీవోపై వాస్తవాలను మీడియా ప్రజలకు వెల్లడించాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభలు నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులు వేదిక స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని తెలిపారు. రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదన్నారు. ఈ జోవో ఉద్దేశం నిషేధం కాదని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జీవో నెంబర్‌1ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

మీడియా సమావేశంలో పాల్గొన్న మరో పోలీసు ఉన్నతాధికారి జీవోలోని అంశాలను చదివి వినిపించారు. రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్న నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు పోలీసులు అనుమతి నిరాకరించవచ్చని తెలిపారు. ఆయా సభలకు పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలు సూచిస్తారని, లేకపోతే సభల నిర్వాహకులే ప్రత్యామ్నాయాలు సూచించవచ్చని అన్నారు. అయితే కొన్ని అరుదైన పరిస్థితుల్లో సభలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడా సభలను నిషేధిస్తామని జీవోలో చెప్పలేదని ఏపీ పోలీసు విభాగం క్లారిటీ ఇచ్చింది.






Next Story