నీళ్లా..? గొడవలా..? అంటే.. నీళ్లే కావాలంటాం.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణతో నీటి వివాదంపై ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు
By - Knakam Karthik |
నీళ్లా, గొడవలా అంటే? నీళ్లే కావాలంటం..ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
అమరావతి: తెలంగాణతో నీటి వివాదంపై ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్లు కావాలా..? గొడవలు కావాలా..? అంటే మేము నీళ్ళే కావాలంటాం.. కాళేశ్వరం నుండి నీటిని తెలంగాణకి ఉపయోగించినప్పుడు దిగువన పోలవరం నుండి ఆంధ్రాకు ఉపయోగిస్తే తప్పేంటి? తెలంగాణ నేతల వివాదాలు మన రాష్ట్రంలో చోప్పించి, వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకం. గోదావరిలో వృధాగా సంవత్సరానికి 3 వేల టీఎంసీలు, సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతున్న నీటిలో, 200 టీఎంసీలు, వాడుకుంటే వాళ్లకు అభ్యంతరం ఎందుకు? రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020 మే 5వ తేదీ ఆమోదముద్ర వేసింది మీరే. అదే నెల 20వ తేదీ NGT స్టే ఆర్డర్ తెచ్చింది జగనే.ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశాడు.
రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు ఐదేళ్ల తన హయాంలో జగన్ కేటాయించింది కేవలం రూ. 2000 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాయలసీమ ప్రాజెక్టులకు రూ. 8 వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఐదేళ్ల హయాంలో మీరు పూర్తి చెయ్యలేని హంద్రీనీవాను మేము ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి చూపించాం. రాయలసీమ మీద ప్రేమ ఉంటే 5 ఏళ్ల పాలనలో హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు గాని, ఒక్క తట్ట మట్టి కూడా ఎందుకు తీయలేదు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 738 కిలోమీటర్ వరకు, మడకశిర బ్రాంచి 493కి. మీ.అమరాపురం చెరువు వరకు కృష్ణమ్మ నీటిని తీసుకు వెళ్లిన ఘనత చంద్రబాబుదే. శ్రీకృష్ణదేవరాయలు తర్వాత చంద్రబాబు హయాంలోనే రాయలసీమ చెరువులు జలకళతో కళకళలాడుతున్నాయి. అబద్దాలకు, అభూత కల్పనలకు ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్మోహన్ రెడ్డి. నిజానికి, నిలకడకు, నిబద్ధతకు, నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు. మీ అవినీతి కరపత్రికలో ఒక పేజీ అబద్ధాలు అచ్చోసినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మేస్థితిలో లేరు..అని నిమ్మల పేర్కొన్నారు.