ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల.. ఫ‌లితాల్లో కృష్ణా జిల్లా హ‌వా..!

AP Inter Results Released. ఏపీ విద్యా శాఖ మంత్రి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ బుధ‌వారం ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు.

By Medi Samrat  Published on  26 April 2023 2:51 PM GMT
ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల.. ఫ‌లితాల్లో కృష్ణా జిల్లా హ‌వా..!

ఏపీ విద్యా శాఖ మంత్రి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ బుధ‌వారం ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ప‌రీక్ష‌లు జ‌రిగిన‌ 22 రోజుల వ్యవధిలో పరీక్షా ఫలితాల విడుదల చేసి స‌రికొత్త రికార్డు న‌మోదుచేశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4,84,197 మంది విద్యార్ధులు హాజ‌రుకాగా.. 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్‌కు 5,19,793 మంది విద్యార్థులు హాజర‌వ‌గా..72 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టీయర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొద‌టిస్థానంలో నిలిచింది. 70 శాతం ఉత్తీర్ణతతో ప.గో జిల్లా రెండో స్థానం, 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా మూడో స్థానం ద‌క్కించుకున్నాయి.

ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫ‌లితాల్లోనూ 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్ మొద‌టిస్థానం ద‌క్కించుకుంది. 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండ‌వ‌, 77 శాతం ఉత్తీర్ణతతో ప.గో జిల్లా మూడ‌వ స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షా ఫ‌లితాల్లో బాలుర మీద‌ బాలికలు పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలురు 58 శాతం, బాలికలు 65 శాతం ఉత్తీర్ణత సాధించ‌గా.. సెకండియర్‌లో బాలురు 68 శాతం, బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్ధులకు ఫలితాలు http://examresults.ap.nic.in/ మరియు https://bie.ap.gov.in/ , https://bieap.apcfss.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి.

ఫలితాలపై రీ వెరిఫికేషన్‌కి మే 6వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని పేర్కొంది. ప్రాక్టికల్స్‌ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయని వెల్ల‌డించింది. మే 3వ‌ లోపు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించుకోవాలని ఇంట‌ర్‌ బోర్డు పేర్కొంది.


Next Story