తిరుపతిలో నిన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. రోడ్ షోలో తమపై రాళ్ల దాడి జరిగిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయగా.. దీనిపై ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు. చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి జరగలేదన్నారు. సానుభూతి కోసమే రాళ్ల దాడి జరిగినట్లు చిత్రీకరించారని విమర్శించారు. వైసీపీకి రాళ్ల దాడి చేయాల్సిన అవసరం లేదన్నారు.
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో సానుభూతి ఓట్లు పొందడం కోసమే ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి బారీ మెజార్టీతో గెలుస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయన్నారు. వివేకా హత్య కేసును కూడా భూతద్దంలో చూపిస్తున్నారని.. త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయన్నారు.