గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం : హోం మంత్రి అనిత
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 17 Jun 2024 7:07 PM ISTగంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో విశాఖలో విచ్చలవిడిగా గంజాయి వ్యాపారం, తరలింపు జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో, విశాఖలో హింసకు ప్రధాన కారణం గంజాయి అని.. కర్రీ లీఫ్స్ పేరుతో ఆన్లైన్ ఫ్లాట్ ఫారంలో విక్రయాలు జరపటం విచారకరం అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, విధానాల వల్ల 1,230 మంది గంజాయి కేసుల్లో ఇరుక్కున్నారన్నారు. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. ఒక్క రివ్యూ కూడా పెట్టకపోవడం వెనుక ఉద్దేశాలు ఏమిటో అర్థం కావటం లేదన్నారు.
పోలీసులకు కనీస వసతులు కల్పించలేదు.. అకాడమీ ఏర్పాటుకు దృష్టి సారించలేదన్నారు. రాష్ట్ర రాజధాని అని చెప్పి విశాఖను గంజాయి, డ్రగ్స్ కి రాజధాని చేశారన్నారు. గంజాయిని అరికట్టడంలో జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. గంజాయి కేసుల్లో ఉన్న వారికి రాజకీయ సిఫార్సులు ఇవ్వబొం.. క్షమించే పరిస్థితి లేదన్నారు. టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారిస్తాం.. ఈ క్రమంలో చెక్ పోస్టులు పెంచుతున్నామన్నారు.
విశాఖ నగరంలో ఉన్న 1700 సీసీ కెమెరాల్లో సగానికి పైగా పని చేయకపోవటం విడ్డూరం అన్నారు. మూడు నెలల్లో ప్రక్షాళన చర్యలు చేపడతాం.. గంజాయిని అరికడతామన్నారు. ఢీ అడిక్షన్ కేంద్రాల సంఖ్యను పెంచుతాం, యువతకు, గిరిజనులకు అవేర్‌నెస్ కార్యక్రమాలు పెడతామన్నారు. అలాగే.. ఈవ్ టీజింగ్ పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గంజాయిని అరికట్టడం ద్వారా నేరాలను అదుపు చేస్తామని.. పోలీస్ సేవలను గుర్తిస్తాం.. గౌరవిస్తామన్నారు. డ్రోన్లను ఉపయోగించి గంజాయి తోటలను గుర్తించి తుది చర్యలు చేపడతామన్నారు. ఒడిషా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం.. హోం మినిస్టర్ గా లేఖ రాస్తానని తెలిపారు.
రాత్రి పూట విశాఖ నగరంలో గుంపులు, గుంపులుగా ఉండే వారిపై దృష్టిపెడతామన్నారు. గంజాయి విషయంలో పోలీసులకు సహకరించి.. సమాచారం అందించిన వారికి ఫ్రైజ్ మనీ ఇస్తామన్నారు. గంజాయి నియంత్రణకు, మహిళా రక్షణకు, భూ దోపిడీ నిలుపుదలకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. గంజాయి పంట పండించే వారిపై, ప్రోత్సహించే వారిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. దిశ మహిళా పోలీస్ స్టేషన్ల పేర్లను మారుస్తాం.. కేవలం మహిళా పోలీస్ స్టేషన్లగానే ఉంటాయన్నారు. రాజకీయపరమైన దాడులకు మేము పాల్పడటం లేదు.. అది కృత్రిమ ప్రచారం అన్నారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. ఒక టీచర్ గా పిల్లల్ని సరిదిద్దిన విధంగానే వ్యవస్థను కూడా సరిదిద్దుతామన్నారు.