రెడ్‌బుక్ ఫాలో అయితే..వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరు: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 March 2025 12:32 PM IST
రెడ్‌బుక్ ఫాలో అయితే..వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరు: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..రెడ్ బుక్ ప్రకారం ముందుకు వెళ్తే, వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరని అన్నారు. కూటమిలో అంతర్యుద్ధం అని కామెంట్స్ చేసిన వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌పై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదని కొట్టిపడేశారు. ముందు వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలంటూ హితవు పలికారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుంచి తప్పించుకోలేరని కామెంట్ చేశారు.
ఇక నుంచి నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతామంటే కుదరదంటూ గోరంట్ల మాధవ్ , ఇటీవలే అరెస్ట్ అయిన పోసాని మురళీకృష్ణలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఆమె పోసాని అరెస్ట్‌పై కూడా స్పందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 17 కేసులు ఉన్నాయని తెలిపారు. గతంలో మంత్రి నారా లోకేశ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై పోసాని చేసిన వ్యాఖ్యలు మానవ మాత్రుడు క్షమించ రాని తప్పని కామెంట్ చేశారు. తమ ప్రభుత్వం క్షక్షపూరిత రాజకీయాలు చేయడం లేదన్నారు. ఇక నుంచి తప్పు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించది లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
కాగా, కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతపురం ఎస్పీ కి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా గోరంట్ల మాధవ్ వ్యవహరించారని ఆ ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు అనంతపురం పోలీసులు మాధవ్ చేసి వ్యాఖ్యలను పరిశీలించి కేసు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒకవేళ ఆయన చేసిన కామెంట్స్ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటే పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు పిలువనున్నారు.