వరదలు రావడం దురదృష్టం.. సీఎంగా చంద్రబాబు ఉండడం అదృష్టం

విజయవాడకు వరదలు రావడం దురదృష్టం.. సీఎంగా చంద్రబాబు ఉండడం అదృష్టం అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు

By Medi Samrat  Published on  10 Sep 2024 10:17 AM GMT
వరదలు రావడం దురదృష్టం.. సీఎంగా చంద్రబాబు ఉండడం అదృష్టం

విజయవాడకు వరదలు రావడం దురదృష్టం.. సీఎంగా చంద్రబాబు ఉండడం అదృష్టం అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విపత్తుల నిర్వహణలో సీఎం చంద్రబాబు ఆదర్శం.. హుద్-హుద్, తిత్లీ, విజయవాడ వరదలనుంచి ప్రజలను కాపాడిన తీరు అందుకు నిదర్శనం అన్నారు. నిరంతర సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో యుద్ధప్రాతిపదికన ముఖ్యమంత్రి సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వరద ప్రాంతాలలో పునరుద్ధరణ, సహాయక చర్యలకు కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ, అవసరమైన నిధులు అందుబాటులో ఉంచామ‌న్నారు. రోడ్లతో పాటు, ఇళ్లను కూడా శుభ్రపరచడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు.

డ్రోన్ ల ద్వారా ఆహారం పంపిణీతో పాటు క్లోరినేషన్ చేయించడం ఒక మోడల్ అన్నారు. వరద బాధితులను ఆదుకోవలసిన ప్రతిపక్ష పార్టీ ఆపద తేవడానికి ప్రయత్నిస్తోందన్నారు. ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో కుట్ర జరిగిందన్నారు. వరదలోనూ బురదజల్లే విపక్ష పార్టీ నాయకులు దేశద్రోహులు అన్నారు. విజయవాడ వరదల నేపథ్యంలో 3-4 రోజుల్లో విద్యుత్, నీటి వసతులను పునరుద్ధరించగలిగామ‌న్నారు. వార్డుకో సీనియర్ ఐఏఎస్, కాలనీకో మంత్రిని నియమించి వరద బాధితులను ఆదుకున్నామ‌న్నారు.

బుడమేరు అంత త్వరగా గండ్లను పూడ్చడం ఆషామాషీ కాదన్నారు. 40 నుంచి 50 టన్నుల బరువున్న 3 బోట్లను నైలాన్ తాడుతో కడితే ఆగుతాయా.? ఉద్ధండరాయునిపాలెం సమీపంలో ఉండాల్సిన పడవలు ఇక్కడికి ఎలా వచ్చాయి? 16 టన్నుల కౌంటర్ వెయిట్ కి బదులు బ్యారేజ్ గేట్లకు తగులుంటే ప్రమాదాన్ని ఊహించగలమా? అని ప్ర‌శ్నించారు. జలవనరులు, పోలీస్ శాఖ విచారణలో ఉషాద్రి, కోమటి రామ్మోహన్ అనే యజమానులవని తేలింది. పడవలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులుండడం యాధృశ్చికమా? తేల్చుతామ‌న్నారు.

ఇసుక బోట్లను పట్టుకోకుండా నాటి ప్రభుత్వంలో మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు సంబంధించిన వారు ఆ రంగులు వేశారా? మాజీ సీఎం కార్యక్రమ సమన్వయ కర్త తలశిల రఘురాం పాత్ర ఎంత? అనేది తేల్చుతామ‌న్నారు. కౌంటర్ వెయిట్ లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు.

పడవలెవరివి? పడవులు పోయాయన్న ఫిర్యాదులు రాకపోవడం వెనుక కారణాలేంటి? 67,68 గేట్ల ధ్వంసం ఆ బోట్ల వల్ల కాదా? 16 నెలలు జైల్ లో ఉండి వచ్చిన వ్యక్తికి ఇలాంటి నేర మనస్తత్వం కాక మానవత్వం ఉంటుందా? అని ఫైర‌య్యారు. గత ప్రభుత్వం లోపాలపై గళమెత్తిన రఘురామకృష్ణంరాజు వంటి వ్యక్తులపై దేశద్రోహం పెట్టారన్నారు.

ప్రకాశం బ్యారేజ్ విధ్వంస కుట్రకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పడవ యజమానుల మీదా దేశద్రోహం కేసులు పెట్టాలన్నారు. 45 గంటల్లోనే కౌంటర్ వెయిట్ లని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాది అని పేర్కొన్నారు. ప్రజలంటేనే ప్రభుత్వం, పాలన.. వాళ్లకు ముప్పు తెచ్చే పనులు చేసే వారిని ఏం చేయాలి? అని ప్ర‌శ్నించారు. వైఎస్ జగన్ రాజకీయాల్లోనే కాదు.. సమాజంలో తిరగడానికి అర్హుడా.? కాదు అన్నారు.

కృష్ణలంక రిటైనింగ్ వాల్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సగం పూర్తయిందన్నారు. ప్రజల కష్టాలు విని స్వాంతన పలకడానికే సీఎం క్షేత్రస్థాయిలో పర్యటనలు అని వివ‌రించారు. ప్రతిపక్షనాయకుడి హోదా లేని విపక్ష పార్టీ అధినేత జగన్ ఇలా వచ్చి అలా వెళ్లి బురద చల్లే ప్రయత్నం చేశారన్నారు. చిన్నారులు సైతం వరదల్లో ఉన్నవారికి దాచుకున్న మొత్తంతో సాయం చేస్తున్నారు.. ఇళ్ళ‌ల్లో పేరుకుపోయిన బురదని కూడా శుభ్రం చేయించిన ముఖ్యమంత్రిని చరిత్రలో చూశామా? అని అడిగారు.

వరదలపై సోషల్ మీడియాలో వక్రీకరణ చేయడం తగదన్నారు. 74 ఏళ్ల వయసులో తీరిక లేకుండా పని చేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలు సిగ్గుచేటు అన్నారు. విజయవాడ సహా జిల్లాలన్నింటిలో వరద బాధితుల నమోదు ప్రక్రియ జరుగుతోందన్నారు. వరద బాధితుల ప్రక్రియ నమోదు యాప్ లో చేపడతాం అన్నారు. బైక్ లు, టీవీలు, ఫ్రిజ్ లు సహా ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతులు చేయించడం సీఎం చంద్రబాబు నాయకత్వానికి నిదర్శనం అన్నారు.

భవిష్యత్ లో దేశవ్యాప్తంగా తుపాన్లు, వరదలను అధిగమించేందుకు విజయవాడ వరదలు, సీఎం చంద్రబాబు చేపట్టిన విధానాలు కేస్ స్టడీ అవుతాయ్ అన్నారు. ఏలేరు వరద ప్రవాహం గురించి కాకినాడ కలెక్టర్ షన్ మోహన్ తో సమీక్షించుకుంటున్నామ‌న్నారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఒకేలా ఉండడం వల్ల కొన్ని చోట్ల ముంపుకు గురయింది.. ప్రమాదమేమీ లేదన్నారు. కొల్లేరు, బుడమేరు, ఏలేరు అన్ని పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. ఐదేళ్ల తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లామని ఓ ఐఏఎస్ చెప్పడం గత ప్రభుత్వ పనితీరును చెబుతుందన్నారు. గత పాలకుల పాపాలను ప్రక్షాళన చేస్తామ‌న్నారు.

తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థలో ఏర్పాటైన సాంకేతిక పరిజ్ఞానానికి కనీసం పైసా ఖర్చు పెట్టకుండా నిర్వీర్యం చేశారన్నారు. ఒడిశా రాష్ట్రంలోని వర్షాలను పర్యవేక్షించుకుని తదనుగుణంగా సహాయక చర్యలు చేప‌డ‌తామ‌న్నారు. విశాఖలోని తెన్నేటి పార్కు, గోపాలపురం, సీతమ్మధార ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు చేపడతామ‌న్నారు. పూర్తి విచారణ జరిగాక నివేదిక తెప్పించుకుని కొన్నింటిపై స్పందిస్తాన‌ని ఆమె అన్నారు.

Next Story