ఏపీ ప్ర‌భుత్వానికి మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు అంశంలో హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్ రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా మ‌ళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాల‌ను(పీపీఏ) సైతం తాజాగా రూపొందించాలని స్పష్టం చేసింది. హైకోర్టు నాయ్య‌మూర్తి జ‌స్టిస్ ఎం.గంగారావు గురువారం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

వ్యవసాయానికి 6,400 మెగావాట్ల విద్యుత్‌ అందించేందుకు ఉద్దేశించి రాష్ట్రంలో పది సౌర విద్యుత్‌ ప్లాంట్లు/పార్కుల ఏర్పాటుకు ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీజీఈఎల్‌) గతేడాది నవంబరు 31న టెండర్లను ఆహ్వానించింది. ఆ టెండర్‌లోని రిక్వెస్ట్‌ ఫర్‌ సెలెక్షన్‌(ఆర్‌ఎఫ్‌ఎస్‌), ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద(పీపీఏ) నిబంధనలు.. కేంద్ర విద్యుత్‌ చట్టం-2003కి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌(టీపీఆర్‌ఈఎల్‌) ఈ ఏడాది జనవరిలో హైకోర్టును ఆశ్రయించింది.టెండర్‌ను రద్దుచేసి తాజాగా పిలిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు డి.ప్రకాశ్‌ రెడ్డి, కిలారు నితిన్‌ కృష్ణ వాదనలు వినిపించారు. విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63కు విరుద్ధమైన నిబంధనలు విధించారన్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల నిబంధనలు కూడా కేంద్ర ఇంధన శాఖ 2017 ఆగస్టు 3న జారీ చేసిన బిడ్డింగ్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ..రైతుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జీ ఇటీవల తీర్పును రిజర్వ్‌ చేసి గురువారం వెల్లడించారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story