'ఈ-వాచ్‌' యాప్‌‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశం

AP High Court orders on SEC E watch app.'ఈ వాచ్' యాప్ ను ఈ నెల 9 వ‌ర‌కు వాడ‌కంలోకి తేవొద్దని హైకోర్టు ఆదేశించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2021 3:47 PM IST
AP High Court orders on SEC E watch app

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం ఏపీ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) 'ఈ-వాచ్' యాప్‌ను తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే.. 'ఈ వాచ్' యాప్ ను ఈ నెల 9 వ‌ర‌కు వాడ‌కంలోకి తేవొద్దని హైకోర్టు ఆదేశించింది. యాప్‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన కొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇది ప్రైవేటు యాప్ అని, తమకు నష్టం కలిగించేందుకే ఈ యాప్ తీసుకువచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది.

దీనిపై నేడు హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ యాప్ కు సంబంధించిన సెక్యూరిటీ సర్టిఫికెట్ ఇప్పటివరకు అందలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. సెక్యూరిటీ సర్టిఫికెట్ వచ్చేసరికి మరో 5 రోజులు పడుతుందని పేర్కొన్నారు. ఎస్‌ఈసీకి ఒక యాప్‌ను రూపొందించుకునే అనుమతి భారత ఎన్నికల సంఘం ఇచ్చిందని ఎన్నికల కమిషనర్‌ న్యాయవాది స్పష్టం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ కూడా ఇలా తయారు చేసిందని న్యాయవాది వెల్లడించారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. అప్ప‌టి వ‌ర‌కు యాప్‌ను అందుబాటులోకి తేవొద్ద‌ని ఆదేశించింది.


Next Story