ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో కొంత మేర ఊరట లభించింది. ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడకూడదంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను కొడాలి నాని హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు తీర్పును ఈరోజుకు రిజర్వ్ చేసింది. కాసేటి క్రితం తీర్పును వెలువరిస్తూ.. ప్రభుత్వ పథకాల గురించి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని తెలిపింది. అయితే.. ఎస్ఈసీ గురించి కానీ, ఎన్నికల కమిషనర్ గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియపై కూడా మాట్లాడకూడదని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తమ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది.
నిన్న జరిగిన విచారణలో పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిర్వహణ విషయంలోనే ఎన్నికల కమిషనర్‌కు విస్తృత అధికారాలు ఉంటాయిగానీ, వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేలా ఉత్తర్వులివ్వడానికి వీల్లేదని అన్నారు. ఎస్ఈసీ తరుపు న్యాయవాధి అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. మంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగసంస్థ అయిన ఎస్ఈసీని గౌరవించాలని.. మంత్రి వ్యాఖ్యలు ప్రజల్లో ఎస్ఈసీ అసమర్ధులనే భావన కలిగిస్తోందని.. అందుకనే మీడియాతో మాట్లాడకుండా మంత్రిని నిలువరించాల్సి వచ్చిందని కోర్టుకు తెలిపారు.