ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్.. మళ్లీ కొట్టేసిన కోర్టు

AP High Court dismisses MLC Ananta Babu's bail plea in murder case. ఏపీ: మాజీ కారు డ్రైవర్ హత్య కేసులో శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు

By అంజి  Published on  12 Oct 2022 11:24 AM GMT
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్.. మళ్లీ కొట్టేసిన కోర్టు

ఏపీ: మాజీ కారు డ్రైవర్ హత్య కేసులో శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. మే నెలలో అరెస్టు చేసిన తర్వాత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) అనంతబాబును సస్పెండ్‌ చేసింది. అరెస్టు చేసిన 90 రోజుల తర్వాత కూడా పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమయ్యారనే కారణంతో అనంతబాబు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే పోలీసులు నిర్ణీత గడువులోగా చార్జిషీటు దాఖలు చేశారని, అయితే సాంకేతిక కారణాలతో కోర్టు దానిని వెనక్కి పంపిందని ప్రాసిక్యూషన్ వాదించింది.

ఇరువర్గాల వాదనలు విన్న డివిజన్ బెంచ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు సింగిల్ జడ్జి గత నెలలో ఎమ్మెల్సీ అనంతబాబుకి డిఫాల్ట్ బెయిల్ నిరాకరించారు. కింది కోర్టు మూడుసార్లు బెయిల్‌ను తిరస్కరించడంతో నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అతడు రాజమహేంద్రవరం జైలులో ఉన్నాడు. తాజాగా అతడి జ్యుడీషియల్ కస్టడీని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఆగస్టులో తన తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుగా మూడు రోజులపాటు అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది.

ఎమ్మెల్సీ అనంత బాబు.. మాజీ డ్రైవర్ వి.సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే నెలలో అరెస్టయ్యారు. పోలీసుల విచారణలో తన కారు మాజీ డ్రైవర్ ను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. తాను ఒక్కడినే సుబ్రమణ్యంను కొట్టి చంపానని తెలిపారు. తన వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం వల్లే చంపేశానని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పాడు. సుబ్రమణ్యం మృతిని మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు పోలీసులు. మృతుడి బంధువులు, దళిత సంఘాల ఆందోళనతో హత్య కేసుగా మార్చారు. పోస్ట్ మార్టమ్ నివేదికలోనూ సుబ్రమణ్యానిది హత్యేనని తేలింది.

Next Story