టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు..వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు..వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో ఇటీవల వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు. జైలులో ఉన్న ఆయనను రెండు రోజుల కిందట వైసీపీ అధినేత జగన్ కలిశారు. ప్రభుత్వం అతనిపై కక్షసాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు.
కాగా.. ప్రస్తుతం జైలులో ఉన్న వంశీని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో 11 మంది నిందితులు ఉన్నారని.. వారిలో ఐదుగురు మాత్రమే అరెస్ట్ అయ్యారని, మరో ఆరుగురిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ అవసరం లేదని వంశీ తరపు లాయర్ వాదించారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతడిని విచారిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.