వడగాల్పుల ముప్పు.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో, ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.

By -  అంజి
Published on : 11 March 2026 8:02 AM IST

Vangalapudi Anitha, Andhra Pradesh, Heatwave Action Plan 2026, Disaster Management, Heatstroke, Summer Safety, AP Government

వడగాల్పుల ముప్పు.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో, ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలో జిల్లా కలెక్టర్లు మరియు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె 'హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026' ను ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో పనులు చేయకుండా పనివేళలను మార్చుకోవాలని సూచించారు. వృద్ధులు, పిల్లలు, కూలీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కుటుంబ సభ్యులకు మంత్రి సూచించారు.

వడదెబ్బకు గురైన వారికి చికిత్స అందించేందుకు ఆసుపత్రులలో ప్రత్యేక బెడ్లు, మందులు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. బస్టాండ్లు, మార్కెట్లు, కూడళ్లు , పర్యాటక ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాలు, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా మజ్జిగ పంపిణీని ప్రోత్సహించాలని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) మరియు విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

అలాగే, ఎండల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఆసుపత్రులు, హోటళ్లు మరియు ప్రైవేట్ భవనాలలో ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలని ఫైర్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.

Next Story