నాలుగో తరగతి ఇండియా మ్యాప్‌లో ఏపీకి రాజధాని లేదు.. 'విద్యార్థులు ఏం జవాబు రాయాలి'
AP has no capital on the map of india in Fourth class text books.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా నాలుగో
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2022 11:32 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా నాలుగో తరగతి మన ప్రపంచం పాఠ్యపుస్తకంలో ముద్రించారు. సెమిస్టర్-2 తెలుగు మాధ్యమం పాఠ్య పుస్తకం చివర్లో ముద్రించిన భారతదేశ పటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాటి రాజధాని పేర్లు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రాజధాని పేరు లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉంది. దీనిపై ఉపాధ్యాయుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. భారతదేశ పటం చూపిస్తూ విద్యార్థులు రాష్ట్రాలు, రాజధానులు పేర్లు చెప్పే సమయంలో రాష్ట్ర రాజధాని ఏమని చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21కి కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించింది. ద్వి బాషా పుస్తకాలను తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాల పరిమాణం తక్కువగా ఉండేందుకు మూడు సెమిస్టర్లుగా విభజించి ముద్రించారు. రెండో సెమిస్టర్ పాఠ్య పుస్తకం చివరిలో భారతదేశ పటాన్ని ఇచ్చారు.
విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం తగదు..
ఏపీ రాజధాని అంశంపై విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ఇవ్వకపోవటం దుర్మార్గమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదనేది పరీక్షల్లో ప్రశ్నగా వస్తే విద్యార్థులు ఏం జవాబు రాయాలి? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా గుర్తించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం విచారకరమన్నారు. దేశ చరిత్రలో రాజధానిలేని రాష్ట్రంగా ఏపీని చేసిన ఏకైక ప్రభుత్వం జగన్ సర్కారే అని విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంత భూములను తాకట్టుపెట్టడంలో ఉన్న శ్రద్ధ, విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ముద్రించడంలో లేదెందుకు? అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించటం ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతినే ఏపీ రాజధానిగా స్పష్టమైన ప్రకటన చేయాలి.