సృజనాత్మకతతో కూడిన విద్యనందించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
రాష్ట్ర విద్యా, ఐటీ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో సింఘానియా గ్రూప్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు.
By Knakam Karthik
సృజనాత్మకతతో కూడిన విద్యనందించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యా నైపుణ్యాల అభివృద్ధి చేసేందుకు సులోచనా దేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విద్యా, ఐటీ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో సింఘానియా గ్రూప్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు.
ఇందులో భాగంగా మొదట ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని తీరు, నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్, జాతీయ విద్యా విధానంతో సమాంతరంగా టెక్నాలజీ అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని తీసుకురావడం ద్వారా పాఠశాలల నిర్వహణలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఐదేళ్ల పాటు అమలు చేసే ఈ కార్యక్రమం ద్వారా లక్ష మంది విద్యార్థుల మెరుగైన విద్యను పొందనున్నారు. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు అమలుచేస్తున్న మూస పద్ధతులకు స్వస్తిచెప్పి సృజనాత్మకత పెంపొందించేలా కెజి టు పిజి విద్య కరిక్యులమ్‌లో సమూల మార్పులు తెస్తున్నామని చెప్పారు. కళాశాల నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.