జగనన్న తోడు పథకం.. లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయం

AP govt to extend Jagananna Thodu for 4.90 lakh beneficiaries in sixth tranche. ఆరో విడతలో జగనన్న తోడు పథకం ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న

By అంజి  Published on  17 Jan 2023 3:00 PM IST
జగనన్న తోడు పథకం.. లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయం

ఆరో విడతలో జగనన్న తోడు పథకం ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న 4,90,376 మందికి తిరిగి రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మండల, మున్సిపాలిటీల వారీగా బ్యాంకర్లు, లబ్ధిదారుల సమావేశాలు నిర్వహించనున్నారు. 25న డీసీసీల జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాల పంపిణీ కార్యక్రమాలను సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ షాన్‌మోహన్‌ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ పీడీలు, మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,28,402 మంది, పట్టణ ప్రాంతాల్లో 1,61,974 మందికి కలిపి ఈ విడతలో 4,90,376 మందికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000ల చొప్పున బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు రుణాలు ఇప్పిస్తోంది. ఇప్పటికే ఐదు విడతలుగా లబ్ధిదారులకు రుణాలు అందజేయగా.. ఆరో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

చిన్న వ్యాపారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి గత 6 నెలలుగా వడ్డీ రూ. 15.17 కోట్లు, అదే రోజు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి బ్యాంకులు రుణ మొత్తాన్ని పెంచి రుణాలిచ్చేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

Next Story