AP Govt: న్యూ ఇయర్‌ వేళ కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు.. ఉచితంగా పంపిణీ

న్యూ ఇయర్‌లో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి 9వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు.

By -  అంజి
Published on : 28 Dec 2025 8:53 AM IST

AP govt, distribute, New Pattadar passbooks, royal seal, APnews

AP Govt: న్యూ ఇయర్‌ వేళ కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు.. ఉచితంగా పంపిణీ

అమరావతి: న్యూ ఇయర్‌లో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి 9వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీనికి రెవెన్యూ శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. రీసర్వే పూర్తైన గ్రామాల్లో గత ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ ఫొటోతో పాస్‌పుస్తకాలు ఇచ్చింది. దీనిపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తం కావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 21.86 లక్షల భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టా పాస్‌పుస్తకాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.22.50 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

కొత్త పట్టదారు పాస్‌పుస్తకాల ముద్రణ పూర్తై చాలా రోజులు అవుతోంది. గత 8 నెలలుగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. వెంటనే రైతులకు కొత్త పాస్‌బుక్‌లను ఇవ్వాలని నిర్ణయించింది. ముద్రణ పూర్తైన పట్టాదారు పాస్‌పుస్తకాల్ని సత్వరమే రైతులకు అందించాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారు.

పట్టాదారు పాసుపుస్తకాలను జనవరి 2 నుంచి 9 వరకు పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ రూపొందించింది. ముందుగా పట్టాదారుల వివరాలను.. వెబ్‌ల్యాండ్‌లోని వివరాల ప్రకారం సరిపోల్చి చూసి ఎలాంటి తప్పులు లేవని నిర్దారించిన తర్వాత పాస్‌పుస్తకాలు అందజేస్తారు. వేలిముద్ర ద్వారా సంబంధిత పట్టాదారుకు కొత్త పుస్తకాలు అందిస్తారు. పంపిణీ ప్రక్రియ వీఆర్వో ఆన్‌లైన్‌ ఈకేవైసీ ద్వారా నిర్వహిస్తారు. ఆ తర్వాత పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు తీసుకుంటారు.

Next Story