ఎన్‌టీఆర్ జిల్లా నందిగామలో సబ్సీడీ టమాటాల కోసం జనం ఎగబడ్డారు. నందిగామ రైతు బజార్ లో ప్రభుత్వం రాయితీపై టమాటాలను విక్రయిస్తోంది. రూ.50 కే విక్రయిస్తుండటంతో ప్రజలు బారులు తీరారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మస్తాన్.. మూడు కౌంటర్ల ద్వారా 2.25 టన్నుల టమాటాలు అమ్మకానికి సిద్ధం చేశారు. గత వారం రోజుల నుంచి టమాట రూ.120కి ఎగబాకడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే రాయితీపై రూ.50కు రావడంతో జనం ఎగబడ్డారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం తక్కువ ధరకే టమాటాలు సరఫరా చేస్తుంది. టమాట ధరలు అందుబాటులో వచ్చేవరకూ ప్రభుత్వం సరఫరా చేయనుంది.
మార్కెట్లో టమాట ధర వంద రూపాయలకు పైగా పలుకుతుంటే.. ఏపీ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల నుంచి టమాటాలను సేకరించి కిలో యాభై రూపాయల చొప్పున విక్రయిస్తోంది. మొదట కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలోని రైతుబజార్లలో సబ్సీడీ టమాటాల విక్రయాలను ప్రారంభించగా.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రైతుబజార్లలో సబ్సీడీ టమాటాల విక్రయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. టమాటాల కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపైన కూడా దృష్టి సారిస్తున్న ఏపీ సర్కార్.. వారి పైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తుంది.