ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బుల చెల్లింపుల కోసం సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకం 'జగనన్న విద్యాదీవెన'. ప్రతి సంవత్సరం విద్యార్థుల తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే గతంలో ప్రకటించిన తేదీ ప్రకారం ఇవాళ 'జగనన్న విద్యాదీవెన' పథకం డబ్బులు విద్యార్థుల తల్లుల అకౌంట్లలో పడాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ పథకాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉండటంతో జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే త్వరలోనే పథకం అమలు తేదీని ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. రాష్ట్ర నలుమూలల నుంచి 15 వేల మందికి పైగా యువతులు తరలిరానున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళా సాధికారత విజయోత్సవ వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన పలు సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ సమావేశానికి గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.