పాపికొండల్లో పర్యాటకానికి ప్రభుత్వం అనుమతులు
AP Govt permits tourism in Papikondalu. పాపికొండల్లో పర్యాటకానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు,
By అంజి Published on 6 Nov 2022 9:15 AM GMTపాపికొండల్లో పర్యాటకానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, పడవ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా గోదావరికి వరద పోటెత్తడంతో పాపికొండలు టూరిజం నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నీటిమట్టం అనుకూలంగా ఉండడంతో శనివారం పాపికొండలు విహారయాత్రకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో పర్యాటక శాఖ అధికారులు పాపికొండలు ట్రయల్ రన్ నిర్వహించారు. పాపికొండలు టూరిజం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.
పాపికొండల విహారయాత్ర తొలిరోజు ఆదివారం ఒక్క బోటు మాత్రమే అందుబాటులో ఉంది. ఏపీ టూరిజం, ప్రైవేట్ టూరిజం శనివారం నుంచి ఈ యాత్రకు టిక్కెట్లను అందుబాటులో ఉంచాయి. బోట్లు విహారయాత్రకు బయలుదేరేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పోశమ్మగండిలోని బోటు పాయింట్, కంట్రోల్ రూం వద్ద రెవెన్యూ, పోలీస్, టూరిజం, ఇరిగేషన్ శాఖల అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. బోటు పాయింట్ వద్ద అన్ని బోట్లలో భద్రతా చర్యలను పరిశీలించారు.
గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అనుమతులు మంజూరు చేసింది. పోశమ్మగండి బోట్ పాయింట్ నుండి పర్యాటకులతో టూర్ బోట్ బయలుదేరే ముందు పైలట్ బోట్ బయలుదేరుతుంది. ఇందులో ఒక పర్యాటక సిబ్బంది, గజ ఈతగాడితో పాటు శాటిలైట్ ఫోన్ ఉంది. వారి వద్ద వాకీ-టాకీ కూడా ఉంటుంది. పైలట్ బోట్ టూర్ బోట్ కంటే ముందుగా వెళ్లి గోదావరిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే కంట్రోల్ రూంకు, వెనుక వస్తున్న బోటుకు వాకీటాకీ ద్వారా సమాచారం అందజేస్తారు. పోశమ్మ గండి బోటు పాయింట్ వద్ద మొత్తం 15 బోట్లు ఉండగా అందులో ఎనిమిది బోట్లకు అనుమతి లభించింది. ఫిట్‌నెస్ తనిఖీ అనంతరం మరో ఏడు బోట్లకు అనుమతి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. వీఆర్ పురం మండలం పోచవరం బోటు పాయింట్ వద్ద 17 బోట్లు ఉండగా, 13 బోట్లకు ఫిట్‌నెస్ అనుమతి ఇచ్చారు.