విద్యా సంస్థలకు దగ్గరలోనే బడ్డీకొట్లు ఉంటాయి.. వాటిలో పిల్లలకు కావాల్సిన వాటితో పాటూ.. సిగరెట్లు, బీడీలు కూడా అమ్ముతూ ఉంటారు. అలాంటి వాటికి పిల్లలు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే విద్యా సంస్థలకు వంద గజాలలోపు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నేరంగా పరిగణించనున్నారు. నిజానికి 2007-08లోనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు ప్రారంభించినా అమలు మాత్రం జరగలేదు. ఈ అంశంపై కేంద్రం నుంచి మరోమారు ఆదేశాలు రావడంతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ దీనిని పటిష్ఠంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఇకపై విద్యా సంస్థలకు వంద గజాల (300 అడుగులు) దూరంలోని దుకాణాల్లో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇకపై దీనిని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించేవారికి రూ. 20 నుంచి రూ. 200 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇతర శాఖల అధికారులతోపాటు హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు కూడా ఇలా జరిమానా విధించే అవకాశం ఉన్నప్పటికీ ఈ విషయం ఎవరికీ పెద్దగా తెలియదట. ఈ నేపథ్యంలో హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యా సంస్థల ప్రాంతాన్ని పొగాకు రహిత ప్రాంతం అని తెలిపేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. పొగాకు నియంత్రణపై ఆరు నెలలకు ఓసారి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లను వైద్య ఆరోగ్యశాఖ కోరింది.