రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఆ సంస్థే నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పేర్కొంది. ఇకపై రాష్టంలోని అన్ని థియేటర్లు ఏపీఎఫ్‌డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలి.
అన్ని థియేటర్లు,ప్రైవేటు సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలని మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రతి టికెట్‌పై 2 శాతం సర్వీస్ చార్జీ వసూలు చేయనున్నారు. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలి. కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మకాలు జరపాలి. సర్వీసు ప్రొవైడర్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమయ్యేందుకు కావాల్సిన మౌలిక వసతుల్ని థియేటర్ల యాజమానాల్యే ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. నెల రోజుల్లోగా అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలని తెలిపింది.