రేషన్‌ కార్డులు ఉన్న వారికి గుడ్‌న్యూస్‌

రేషన్‌ కార్డులు ఉన్న వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

By అంజి  Published on  19 Dec 2023 6:36 AM IST
AP Govt, pulses, ration card holders, CM Jagan

రేషన్‌ కార్డులు ఉన్న వారికి గుడ్‌న్యూస్‌

రేషన్‌ కార్డులు ఉన్న వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పును తరలించనుంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జనవరిలో 8 వేల టన్నుల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తోంది. కేజీ రూ.67 చొప్పున కందిపప్పును రేషన్‌కార్డుదారులకీ అందించనుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేస్తుండగా.. జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. అటు తొలిసారిగా రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి, సరఫరా చేయనుంది. డిసెంబర్‌ నెలలో 46.64 లక్షల మందికి సుమారు 4,604 టన్నుల కందిపప్పును కిలో రూ.67కే అందించింది.

గిరిజన ప్రాంతాల్లోని జీసీసీల ద్వారా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలు జరిగేలా ప్రోత్సహించనుంది. సంవత్సర కాలంగా మార్కెట్‌లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి. మహారాష్ట్రలో భారీవర్షాలకు కందిపంట పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఒక్కసారిగా కందిపప్పుకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లోకి కొత్తపంట వస్తుండటంతో ధర దిగొస్తోంది. ఒకప్పుడు మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.115 ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రేటు రూ.160-170కి పెరిగినా సబ్సిడీని తగ్గించలేదు. మధ్యలో 3, 4 నెలలు మార్కెట్‌లో లోటు ఉండటంతో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇకపై నిరంతరాయంగా పంపిణీ చేసేలా పౌరసరఫరాలశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది.

Next Story