ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే పండుగ ప్రాముఖ్యత దృష్ట్యా సెలవు ఇవ్వాలని బ్యాంకు సంఘాల ప్రభుత్వానికి విన్నవించుకున్నాయి.
విన్నపాన్ని పరిశీలించిన ప్రభుత్వం.. తాజాగా 16వ తేదీన సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవు ప్రకటనతో వరుసగా పండుగ సెలవులు రావడంతో సామాన్య ప్రజలు తమ బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అటు వారంలో 5 వర్కింగ్ డేస్ కోసం ఈ నెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆ రోజున బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. తమ ప్రధాన డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు పోరాట బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.