మైనారిటీ రాయితీ రుణాలకు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌.. రూ.326 కోట్లతో 49, 218 మందికి లబ్ధి

రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  22 Jan 2025 5:22 PM IST
మైనారిటీ రాయితీ రుణాలకు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌.. రూ.326 కోట్లతో 49, 218 మందికి లబ్ధి

రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి అర్హత కలిగిన మైనార్టీలకు స్వయం ఉపాధి,నైపుణ్య, ఉపాధి కల్పన కోసం రూ.326 కోట్లు ఖర్చు చేసేందుకు, క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టిందని బుధవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. మైనార్టీలకు రాయితీ రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం తరఫున రూ.152.50 కోట్లు, వెచ్చింపుకు పాలనాపరమైన అనుమతులను జారీ చేస్తూ జీవో విడుదల చేసిందని తెలిపారు. మరో 50% రూ.152.50 కోట్లు రుణ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు అదనంగా రూ. 21.07 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా రాయితీ రుణాలను 19,790 మందికి, నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన ద్వారా 29,428 మందికి మొత్తం లబ్ధిదారులు 49,218 మంది ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేయూతను ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.

కేటగిరీల వారీగా రాయితీ రుణాల మంజూరు

మైనార్టీల సంక్షేమ, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వార్షిక రాయితీ రుణ మంజూరు ప్రణాళికలో కేటగిరీల వారీగా రుణాలను మంజూరు చేయబోతున్నట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. స్వయం ఉపాధి కింద 19,790 మంది లబ్ధిదారులకు వారు ఏర్పాటు చేసుకునే యూనిట్ల వారిగా మూడు విభాగాలుగా గుర్తించి రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో 15,000 మంది లబ్ధిదారులకు రూ.లక్ష లోపు రుణం, 3,040 మంది లబ్ధిదారులకు రూ. 1 లక్ష నుండి రూ. 3 లక్షల వరకు, 1,525 మంది లబ్ధిదారులకు రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు, 225 మంది లబ్ధిదారులకు రూ. 8 లక్షలు ప్రకారం రుణం అందించనున్నట్లు తెలిపారు.

ప్రతి స్కీమ్ లో కనీసం 40% మహిళలకు చోటు కల్పిస్తారు. రూ. లక్ష లోపు రుణాలు మంజూరులో కిరాణా, పాన్, చికెన్, మటన్, పండ్లు, కూరగాయలు స్టాల్స్ ఏర్పాటు, ఎలక్ట్రికల్ రిపేరీ, సైకిల్ షాప్ లో తదితర యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు ఇస్తారు. రూ. 1 లక్ష నుండి రూ. 3 లక్షల లోపు ఏసి, ఫ్రిడ్జ్ రిపేరీ, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, బ్యాటరీ సర్వీసింగ్, సెల్ ఫోన్ రిపేరీ, మటన్, చికెన్ షాప్ లు, చెప్పుల షాపులు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్ తదితర యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు అందిస్తారు. రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఆటోమొబైల్ సెక్టార్, ట్రాన్స్ పోర్టు సెక్టార్, ఫ్యాబ్రికేషన్ సెక్టార్ తదితర యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందిస్తారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారికి మండల కేంద్రాలు, పురపాలక, నగరపాలక కేంద్రాలలో ఉన్నవారికి జనరిక్ మందుల దుకాణాలు, ఆటోమొబైల్ యూనిట్లు, ఫిట్ నెస్ సెంటర్లు తదితర యూనిట్లు ఏర్పాటు చేసుకున్నందుకు రూ. 8 లక్షలు రాయితీ రుణం మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా 25,000 మందికి, మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కింద టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర వాటిల్లో 3,428 మందికి, మైనార్టీ ఎంపవర్మెంట్ కింద ఆటోమొబైల్ సెక్టార్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ తదితర వాటిల్లో 1000 మంది మైనార్టీలకు,మొత్తం 29,428 మందికి శిక్షణ ఇవ్వబోతున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి అప్పటి పాలకులు తూట్లు పొడిచారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే అన్ని రంగాలలో పూర్తిగా బ్రష్టు పట్టి పోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు చేస్తున్న కృషితో అప్పటి సమస్యల పరిష్కారం వేగవంతంగా కొలిక్కి వస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా వార్షిక ప్రణాళిక ప్రకారం నిధుల మంజూరు, తదుపరి అభివృద్ధి చర్యలు, ఆర్థిక చేయూతకు రాయితీ రుణాలు, మైనార్టీల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.

Next Story