మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆ తేడా లేకుండా అందరికీ విద్యుత్ సబ్సిడీ
మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం సుస్థిరమైన మత్స్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖ ల మంత్రి కే. అచ్చెన్నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 22 Nov 2024 2:00 AM GMTమత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం సుస్థిరమైన మత్స్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖ ల మంత్రి కే. అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు-2024 సందర్భంగా తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి, భద్రత కోసం మత్స్య రంగంలో ఎదురవుతునన క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రతి ఏటా నవంబర్ 21 న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుదీర్ష తీర ప్రాంతం 1020 కిమీ, 2.26 లక్షల హెక్టార్ల ఆక్వా కల్చర్ అనేక నీటి వనరులను కలిగి ఉందన్నారు. దేశంలో 75 శాతం కంటే ఎక్కువ కల్చర్ రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, భారతదేశం యొక్క ఆక్వా హబ్ గా నిలుస్తుందన్నారు. ఆక్వా రంగానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తుందన్నారు. దశాబ్దాల నుంచి మత్స్యకారులకు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు అండగా నిలుస్తున్నారని, ఆ వరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారన్నారు. మత్స్యకారులకు రాజకీయంగా ప్రముఖ స్థానం కల్పించడమే కాకుండా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నామన్నారు.
గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదని కేంద్రం నుంచి నిధులను కూడా పొందలేకపోయారన్నారు. అంతేకాకుండా 217 జీవో ను తెచ్చి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేరన్నారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా ప్రతి 30 కిలోమీటర్ కు ఒక హార్బర్ కాని ఒక జెట్టీ కాని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటే మత్స్యకారులకు మేలు కలుగుతుందన్నారు. 2014-19 లో ఇచ్చిన విధంగా వేట సమయంలో చనిపోయిన వారికి రూ. 5 లక్షలు ఇచ్చేవారమని, గత ప్రభుత్వ సమయంలో చనిపోయిన వారిలో కొద్దిమందికి మాత్రమే చెల్లించి మిగతా వారికి చెల్లించలేదన్నారు. ఆ బకాయిలు మూడున్నర కోట్లు, డీజిల్ సబ్సిడీ రూ. 34 కోట్లు అధికారంలోకి రాగానే మా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు.
జోన్, నాన్-జోన్ అనే తేడా లేకుండా అందరికీ విద్యుత్ సబ్సిడీ అందిస్తామన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే బోట్ కు ట్రాన్స్ పాండర్స్ బిగిస్తే చేపలు ఎక్కడ ఉన్నదీ, తుపానుల తీవ్రత, అకాల వర్షాలు తెలుస్తాయని, ఇప్పటికే 4,500 బోట్లకు ట్రాన్స్ పాండర్స్ ఏర్పాటు చేశామని.. రాష్ట్రంలో 30,000 బోట్లకు కూడా వాటిని ఏర్పాటు చేస్తామన్నారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడతూ.. దేశంలో 1997 నుండి ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, భవిష్యత్ తరాలకు ఈ సంప్రదాయాన్ని అందించేలా రాష్ట్రంలో కూడా నిర్వహిస్తున్నామన్నారు. మత్స్యకారులకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని, చాలా పథకాలు ప్రచారంలోకి రావటంలేదన్నారు. మత్స్యకారులకు రూ. 750 కోట్లు బడ్జెట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చెల్లించే భృతిని మా నాయకుడు తీసుకొచ్చారన్నారు. జీవో 217 మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టిందని...దానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక పోరాటాల చేశామని.. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఆ జీవోను రద్దు చేశామన్నారు. కాకినాడ శాసనసభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) గత ప్రభుత్వంలో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. 217 జీవోకు వ్యతిరేకంగా పోరాడిన సమయంలో చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డారని.. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఆ జీవోను రద్దు చేశారన్నారు.