అమరావతి: బీసీ కులాల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. బీసీలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో సగం రాయితీ ఉంటుంది. జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.8 లక్షలు ఇవ్వనుంది. ఇందులో రూ.4 లక్షలు రాయితీ ఇస్తారు. ఈబీసీలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తోంది. ఇందులోనూ 50 శాతం రాయితీ ఇస్తోంది. ఎంపీడీవో ఆఫీస్‌లో అప్లై చేసుకోవాలి.
బీసీ వర్గాల సేవా సహకార సంస్థ ద్వారా రూ.25.6 కోట్ల విలువైన పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే బీసీ కులాల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీతో రాయితీ రుణాలు అందిస్తున్నారు. ఈ సబ్సిడీ రుణాల ద్వారా వారు స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలలోని వెనుకబడిన తరగతుల సేవా సహకార సంస్థ అప్లికేషన్లు తీసుకుంటోంది. ఈ విధానంలో మూడు శ్లాబుల విధానం ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకాలకు అర్హత వయస్సును 21 నుంచి 60 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. .ఆ ఆ తర్వాత స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సంప్రందించాల్సి ఉంటుంది.