మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఈ నెల 10వ తేదీన నారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నారాయణకు 11వ తేదీ ఉదయం చిత్తూరు నాలుగో అదనపు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో నారాయణ కుట్ర ఉందని.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు చేయడంపై జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలయ్యిందని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. బెయిల్ పిటిషన్ వేయకుండానే బెయిల్ మంజూరు చేశారు.. చట్టం ముందు అందరూ సమానులే'' అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. మే 11న చిత్తూరులోని స్థానిక కోర్టు నారాయణకు బెయిల్ మంజూరు చేసింది.